క్రిస్మస్ అంటేనే ఆనందాల పండుగ. ఈ వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. లైట్లతో ధగధగ మెరిసే ఈ పండుగలో డ్రై ఫ్రూట్ కేక్ వాసన అందరి నోళ్లలో నీళ్లు ఊరేలా చేస్తుంది. చాలామంది బయటి నుంచి కేక్ కొని తెచ్చుకుంటారు. దీనికి కారణం ఓవెన్ లేకపోవడమే. ఇంట్లో ఓవెన్ లేకపోయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. గుడ్లు లేకుండా క్రిస్మస్ డ్రై ఫ్రూట్ కేక్ ఇంట్లో సులభంగా తయారు చేయవచ్చు. అది కూడా ప్రెజర్ కుకర్‌లో సులభంగా తయారు చేయవచ్చు.ఆ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
డ్రై ఫ్రూట్స్: (ఎండుద్రాక్ష,టుటి ఫ్రూటీ, తరిగిన జీడిపప్పు, బాదం, వాల్ నాట్స్, ఖర్జూరం, అంజూర పండ్లు, చెర్రీస్) :ఒక కప్పు
నారింజ రసం: ఒక కప్పు
మైదా పిండి: ఒక కప్పు
గోధుమ పిండి: ఒక కప్పు
పొడి చకెర: 3/4 కప్పు
నూనె లేదా నెయ్యి: అర కప్పు
పెరుగు: అర కప్పు
పాలు: అర కప్పు
బేకింగ్ పౌడర్: ఒక టీ స్పూన్
బేకింగ్ సోడా: పావు టీ స్పూన్
దాల్చిన చెక పొడి:
అర టీస్పూన్
జాజికాయ పొడి:
పావు టీ స్పూన్
అల్లం పొడి: పావు టీస్పూన్
వెనిల్లా ఎసెన్స్: ఒక టీస్పూన్
ఉప్పు: చిటికెడు
చకెర: అర కప్పు
గోరువెచ్చని నీరు: పావు కప్పు
తయారుచేసే పద్ధతి
ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేయడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని నారింజ రసంలో రాత్రంతా నానబెట్టాలి. ఇది డ్రై ఫ్రూట్స్‌ని మృదువుగా చేస్తుంది. అదనంగా కేకుకి మంచి రుచిని ఇస్తుంది. ఆ తర్వాత కేక్ కోసం కారామెల్ సిరప్ సిద్ధం చేయడానికి ఒక పాన్‌లో అర కప్పు చకెర వేసి తక్కువ ఫ్లేమ్‌లో వేడి చేసుకోవాలి. చకెర గోధుమ రంగులోకి మారినప్పుడు జాగ్రత్తగా పావు కప్పు వేడి నీటిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో పెరుగు, పొడి చకెర వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత నూనె లేదా నెయ్యి వేసి వెనిల్లా ఎసెన్స్ జోడించాలి. ఆ తరువాత చల్లబడిన కారామెల్ సిరప్ వేసి బాగా కలపాలి. పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, సుగంధ ద్రవ్యాలను జల్లెడ పట్టి ఒక్కొక్కటిగా వాటిని అందులో యాడ్ చేయాలి. పిండి రిబ్బన్ టైప్ స్థిరత్వం కలిగి ఉండేందుకు కొద్దిగా పాలు కలుపుకోవడం మంచిది. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని సైతం రసంలో వేసి బాగా కలపాలి.
మందపాటి అడుగు ఉన్న పాన్ లేదా ప్రెజర్ కుకర్‌లో ఒక కప్పు ఉప్పు వేయాలి. పైన స్టాండ్ ఉంచాలి. కుకర్ని మీడియం వేడి మీద 10 నిమిషాలు వేడి చేయాలి. కేక్ టిన్కి నెయ్యి రాసి, పిండి చల్లుకోవాలి. ముందుగా తయారుచేసిన పిండిని అందులో పోసి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. టిన్ని స్టాండ్‌పై ఉంచి ప్రెజర్ కుకర్పై మూత పెట్టాలి. ఇప్పుడు తకువ మంట మీద 45 -60 నిమిషాలు బేక్ చేయాలి. అప్పుడప్పుడు టూత్ పిక్‌తో కేక్‌పై గుచ్చుతూ పరిశీలిస్తూ ఉండాలి. టూత్ పిక్కి ఏ పదార్థం అంటకుండా శుభ్రంగా బయటికి వస్తే కేకు రెడీ అయినట్టే. ఆ తర్వాత కేక్‌ని చల్లార్చి, టిన్ నుంచి తీసి పైన పొడి చకెర చల్లుకోవాలి. ఇంకేముంది మృదువైన, జ్యూసీ, డ్రై ఫ్రూట్స్‌తో నిండిన యమ్మీ కేక్ రెడీ!