న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan), తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్‌పై మరోసారి పైచేయి సాధించారు. ఆయనకు కేటాయించిన బంగ్లాతోపాటు అక్కడున్న పార్టీ కార్యాలయాన్ని తిరిగి దక్కించుకున్నారు. నవంబర్ 13లోగా ఆ బంగ్లాను ఖాళీ చేయాలని పశుపతి పరాస్‌ను భవన నిర్మాణ విభాగం ఆదేశించింది. దీంతో నవంబర్ 11న ఆయన ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కార్తీక పూర్ణిమ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ ఆ బంగ్లాను సందర్శించారు. తన బావ, జముయ్ ఎంపీ అరుణ్ భారతితో కలిసి అక్కడ పూజలు నిర్వహించారు.
కాగా, ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగంతో మాట్లాడారు. తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ జ్ఞాపకాలు ఈ కార్యాలయంతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. ఇది మళ్లీ తనకు దక్కిందని చెప్పారు. పరిస్థితుల వల్ల బాబాయ్‌తో విభేదాలు తలెత్తాయని అన్నారు. అయితే ఈ పార్టీ కార్యాలయం ఎవరికీ చెందినది కాదని స్పష్టం చేశారు. ‘ఇవాళ మాకు ఉంది. రేపు మరొకరికి ఉంటుంది’ అని అన్నారు.
మరోవైపు లోక్ జనశక్తి పార్టీ ఆస్తులు, వారసత్వంపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో బాబాయ్ పశుపతి పరాస్‌పై పైచేయి సాధించినట్లుగా చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నారు. బంగ్లా, పార్టీ కార్యాలయం తిరిగి దక్కడంతో రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయ వారసత్వానికి వారసుడిగా పార్టీని బలోపేతం చేయడంపై ఆయన దృష్టిసారించారు.