Chirag Paswan : బీహార్ (Bihar) లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో కొత్త పొత్తు కుదిరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి (Union minister) చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (LJP), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ (JSP) కూటమి కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పాశ్వాన్‌కు కూటమిలోని ఇతర పార్టీలైన బీజేపీ (BJP), జేడీయూ (JDU) తో సీట్ల షేరింగ్‌లో లెక్క కుదరడం లేదు.
బీహార్‌లోని మొత్తం 243 స్థానాల్లో ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ తలో 100 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. మిగతా 43 స్థానాలను ఎల్జేపీ సహా చిన్నచిన్న పార్టీలకు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. అందులో 25 స్థానాలు ఎల్జేపీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మాత్రం.. తన పార్టీకి 40 అసెంబ్లీ స్థానాలు కావాలని అడుగుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 5 స్థానాలు కేటాయిస్తే ఐదింట గెలిచామని, ఇప్పుడు 40 స్థానాలు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఒకవేళ 40 స్థానాలు ఇవ్వకపోతే కూటమి నుంచి బయటికి వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఎన్డీఏ కూటమిలో షీట్ల షేరింగ్‌పై తాను బీజేపీతో మాత్రమే మాట్లాడుతానని, జేడీయూతో సంబంధం లేదని అన్నారు. అంటే నితీశ్ కుమార్ అంటే తనకు గిట్టదని ఆయన మరోసారి చెప్పకనే చెప్పారు. బీజేపీ కూడా తన డిమాండ్‌ను ఒప్పుకోకపోతే.. ఏ క్షణంలోనైనా కూటమి నుంచి బయటికి వెళ్లే ఆప్షన్ తనకు ఉన్నదని అన్నారు. ప్రశాంత్ కిషోర్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేస్తే సగానికిపైగా స్థానాల్లో పోటీచేయవచ్చని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చిరాగ్ ఆలోచన అని, అది అతని ప్లాన్ బీ అని ఎల్జేపీ వర్గాలు చెబుతున్నాయి.