న్యూఢిల్లీ: విమానం గాలిలో ఉండగా దొంగతనం జరిగింది. తమ డెబిట్, క్రెడిట్ కారులు చోరీ అయ్యాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. చైనా జాతీయుడు కూర్చొన్న సీటు కింద ఒక క్రెడిట్ కార్డును విమాన సిబ్బంది గుర్తించారు. (Chinese Man Arrested) చైనా వ్యక్తులు ప్రయాణికుల బ్యాగులను ఓపెన్ చేయడాన్ని ఒకరు రికార్డ్ చేశారు. మే 14న హాంకాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగింది.
కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే చైనా జాతీయుడైన 30 ఏళ్ల బెన్లై పాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ విమానంలో ప్రయాణించిన మరో ముగ్గురు చైనా జాతీయులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం వాటిని పంపారు.
మరోవైపు దూర ప్రయాణ విమానాల్లో చోరీలకు పాల్పడే గ్లోబల్ సిండికేట్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విమాన చోరీలతో వారికి ప్రమేయం ఉన్నదా అన్నది ఆరా తీస్తున్నారు. అంతర్జాతీయ సమన్వయంతో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.