న్యూఢిల్లీ : చైనాలో అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు గమ్మత్తుగా, వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. చైనా ఇప్పుడు పలు సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకవైపు తగ్గిపోతున్న సంతానోత్పత్తి. మరోవైపు, ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నది. ఇంకోవైపు, నిరుద్యోగం పట్టిపీడిస్తున్నది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి నిరుద్యోగులకు సేవలు అందిస్తాయి. అంటే, ఇవేమీ ఉద్యోగాలు సృష్టించవు. కానీ, నిరుద్యోగులు తమకు ఉద్యోగం ఉన్నట్టు కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ కొత్త కంపెనీలు పెద్ద నగరాల్లో ఆఫీస్ స్థలాలను అద్దెకు తీసుకుని నకిలీ కార్యాలయాలుగా మారుస్తున్నాయి. నిరుద్యోగులు ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్తున్నట్టు ఇంట్లో బయలుదేరి ఇక్కడికి కొచ్చి ఆఫీసు సమయం ముగిసే వరకు ఉండి ఇంటికి వెళ్లిపోవచ్చు. తద్వారా ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించవచ్చు. ఇవి రోజుకు 30 నుంచి 50 యువాన్లు అంటే దాదాపు 350 నుంచి 600 రూపాయల వరకు వసూలు చేస్తాయి. ఇవి చట్టబద్ధ సంస్థలు కావు.
కొందరు ఈ స్థలాలను కోవర్కింగ్ స్పేస్‌లుగా ఉపయోగిస్తుంటారు. మరికొందరు ఉద్యోగం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి వీటిని ఆశ్రయిస్తున్నారు. ఒక యువతి తన తల్లికి తాను మంచి ఉద్యోగం సంపాదించినట్టు చూపించేందుకు, సోషల్ మీడియా కోసం కంటెంట్ చిత్రీకరించడానికి ఒక్క రోజు మాత్రమే ఈ సేవలను ఉపయోగించుకుంది. 25 ఏళ్ల ర్యాన్ 18 నెలల క్రితం పట్టభద్రుడయ్యాడు, కానీ అతనికి సరైన ఉద్యోగం దొరకలేదు. అందువల్ల, అతను జియాంగ్సు ప్రావిన్స్‌లో ఒక నకిలీ ఉద్యోగ సంస్థలో చేరాడు. ఆరు నెలలుగా, అతను ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు కార్యాలయంలో కూర్చుని, తాను ఉద్యోగం చేస్తున్నట్టు చూపించడానికి తన తల్లిదండ్రులకు ఫోటోలు పంపుతున్నాడు. కొందరు ఇలా పని చేయడానికి డబ్బు చెల్లించడాన్ని మూర్ఖత్వంగా భావిస్తున్నారు. అయితే ఈ సంస్థలు కొన్నిసార్లు ఉచిత కాఫీ, భోజనం కూడా అందిస్తాయి. చాలామంది తమలాంటి సమస్యలతో బాధపడుతున్న ఇతరులను కలుసుకోవడానికి ఇక్కడ చేరుతారు.