న్యూఢిల్లీ: భారత్ సరిహద్దులో యుద్ధ విమానాలను చైనా మోహరించింది. (China fighter jets) సిక్కిం సమీపంలో అధునాతన స్టెల్త్ ఫైటర్స్‌ను ఉంచింది. మే 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయపడింది. సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో సైనిక, ప్రజల అవసరాల కోసం వినియోగించే ఎయిర్‌పోర్ట్‌ను చైనా నిర్మించింది. టిబెట్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన షిగాట్సేలో 12,408 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోని ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఆరు అధునాతన జే-20 ఫైటర్ జెట్లను చైనా మోహరించింది. ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కేజే-500 కూడా ఇక్కడ ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే సంస్థ పేర్కొంది.
కాగా, సిక్కిం సమీపంలో జే-20 యుద్ధ విమానాలను చైనా మోహరించడం గురించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు తెలుసని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి కౌంటర్‌గా పశ్చిమ బెంగాల్‌లోని హసిమారా ఎయిర్‌బేస్‌లో 16 రాఫెల్స్ యుద్ధ విమానాలతో రెండవ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి.