న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్( India-Pakistan conflict) సమయంలో చైనా అవకాశవాదానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సంక్షోభ సమయంలో డ్రాగన్ దేశం తన అత్యాధునిక ఆయుధాలను పరీక్షించినట్లు అమెరికా తాజా రిపోర్టులో పేర్కొన్నది. ఇండో-పాక్ సమరాన్ని.. చైనా తన ఆయుధ పరీక్షకు వాడుకున్నట్లు యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూర్టీ రివ్యూ కమీషన్ వెల్లడించింది. మంగళవారం ఆ కమిటీకి చెందిన నివేదికను రిలీజ్ చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ఇండియా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా అక్రమ రీతిలో తన ఆయుధాలను పరీక్షించినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇండోపాక్ సమరం వేళ చైనా తన ఆయుధ సంపత్తిలో ఉన్న హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పీఎల్-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్, జే-10 ఫైటర్ విమానాలను పరీక్షించినట్లు అమెరికా తన రిపోర్టులో చెప్పింది. నాలుగు రోజుల ఆ యుద్ధంలో చైనా తన ఆయుధాలను వాస్తవిక ప్రపంచంలో పరీక్షించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు అండగా నిలుస్తున్న చైనా.. తన ఆయుధాలను ఆ దేశానికి అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నది. జే-35 ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను సుమారు 40 వరకు అమ్మేందుకు పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జే-35 ఫైటర్ జెట్స్తో పాటు కేజే-500 విమానాలు, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను కూడా పాక్‌కు అమ్మేందుకు డ్రాగన్ దేశం జూన్‌లోనే డీల్ చేసుకున్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు.
ఇండియా, పాక్ సంక్షోభ సమయంలో వాడిన ఆయుధాలు సక్సెస్ అయినట్లు చైనా ఎంబసీలు ప్రశంసలు కురిపించాయి. వెపన్ సేల్స్ పెంచేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు రిపోర్టులో చెప్పారు. పలు దఫాల చర్చలు, పరిశోధనల అనంతరం కమిటీ ఈ విషయాన్ని ద్రువీకరించింది. ఇండోపాక్ వార్‌ను పరోక్ష యుద్దంగా చైనా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ యుద్ధంలో ఆయుధాలను వాడిన చైనా.. రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించినట్లు అమెరికా కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.
ఫ్రెంచ్ తయారీకి చెందిన రఫేల్ యుద్ధ విమానాల గురించి చైనా తప్పుడు ప్రచారం చేసినట్లు అమెరికా తన రిపోర్టులో స్పష్టం చేసింది. రఫేల్ యుద్ధ విమానాల అమ్మకాలను తగ్గించేందుకు చైనా తమపై తప్పుడు ప్రచారం చేసిందని ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నట్లు రిపోర్టులో తెలిపారు. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఏఐ, వీడియో గేమ్ ఇమేజ్‌లను వైరల్ చేశారు. చైనాకు చెందిన ఆయుధాలు రఫేల్‌ను కూల్చివేసినట్లు ప్రచారం నిర్వహించారు. జే-35 యుద్ధ విమానాలను అమ్ముకునేందుకు చైనా ఈ ప్రయత్నం చేసినట్లు కమిటీ తన రిపోర్టులో వెల్లడించింది.
రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనుకున్న ఇండోనేషియాను చైనా ఎంబసీ అధికారులు అడ్డుకున్నట్లు కూడా రిపోర్టులో పేర్కొన్నారు. కానీ అమెరికా ఇచ్చిన రిపోర్టును చైనా కొట్టిపారేసింది. ఆ నివేదికలో వాస్తవం లేనట్లు డ్రాగన్ దేశం పేర్కొన్నది. అమెరికా రిపోర్టులో తప్పులు ఉన్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.
ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను చంపేశారు. ఈ నేపథ్యంలో మే 7వ తేదీన భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. పాక్‌తో పాటు పీవోకేలో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఇండియా. ఆ సమయంలో పాక్ మిస్సైల్, డ్రోన్ దాడికి దిగింది. కానీ వాటిని భారత్ తిప్పికొట్టింది. పాక్‌లో ఉన్న ఎయిర్‌ఫీల్డ్స్‌ను ఇండియా టార్గెట్ చేసింది. మే 10వ తేదీన భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే.