న్యూఢిల్లీ, జూలై 20: దురాక్రమణ అహకారంతో చైనా రెచ్చిపోతున్నది. భూటాన్ భూభాగంలో అక్రమంగా గ్రామాలు నిర్మిస్తున్నది. వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతాల విషయంలో భారత్ మీద పైచేయి సాధించేందుకు పావులు కదుపుతున్నది. తద్వారా భారత్కి చెందిన కీలకమైన ప్రాంతాలపై కూడా కన్నేసే ప్రమాదం ఉన్నది. చైనా చేపట్టిన గ్రామాల నిర్మాణానికి సంబంధించి మాక్సర్ సంస్థ శాటిలైన్ చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
2017లో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగిన డోక్లాం పీఠభూమికి తూర్పుగా 9 కిలోమీటర్ల దూరంలో పంగ్డా పేరుతో ఓ గ్రామాన్ని నిర్మించింది. అక్కడికి తమ దేశ ప్రజలను తరలించింది. భూటాన్ భూభాగంలోని అమోచూ నదీ వెంబడి నిర్మించిన ఈ గ్రామంలో భవనాలు, ఇండ్ల ముందు కార్లు పార్కింగ్ చేసివున్న దృశ్యాలు మాక్సర్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. నదీ తీరంలో ఏకంగా 10 కిలోమీటర్ల దూరం మేర భూమిని చైనా ఆక్రమించింది. ఈ ప్రాంతంలో రెండో గ్రామం కూడా నిర్మాణం జరుగుతున్నది. ఇక మూడో గ్రామం కోసం నదిపై ఓ వారధి నిర్మాణం కూడా చేపట్టింది.
భారత్కు ఆందోళనకరమే..
డోక్లాం సమీపంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నదంటే భారత్కు ఆందోళనకర అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్మాణాలతో అమోచూ నది సమీపం నుంచి అత్యంత కీలకమైన డోక్లాం పీఠభూమిలోని జంపేరి అనే వ్యూహాత్మక శిఖరానికి చేరుకోవడం చైనా బలగాలకు తేలికవుతుంది. దీని వలన భారత్కి చెందిన సున్నితమైన, వ్యూహాత్మకమైన దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య రాష్ర్టాలను కలిపే సిలిగురి కారిడార్ ప్రాంతం నేరుగా డ్రాగన్ గురిలోకి వస్తుంది. 2017లో జంపేరీ వద్దకు రాకుండా చైనా సైనికులను భారత బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అదే శిఖరానికి చేరుకోవ డానికి డ్రాగన్ ఈ కుట్రకు పాల్పడింది.