Rafale | ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలకు వ్యతిరేకంగా చైనా రాయబార కార్యాలయాల ద్వారా ప్రచారం చేస్తోందని.. ఫ్రెంచ్ యుద్ధ విమానాల సామర్థ్యంపై సందేహాలను లేవనెత్తేందుకు ప్రయత్నిస్తోందని ఫ్రెంచ్ సైనిక, నిఘా సంస్థలు ఓ నివేదికలో వెల్లడించాయి. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రచారం భారీగా పెరిగింది. చైనా తమ యుద్ధ విమానాలు రఫేల్ కంటే మెరుగైన ప్రదర్శన చేసినట్లుగా డ్రాగన్ దేశం ప్రచారం చేసుకుంటున్నది. నివేదికల ప్రకారం.. చైనా రాయబార కార్యాలయాల్లో పోస్ట్ అయిన రక్షణశాఖ అధికారులు వివిధ దేశాలను రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయొద్దని పట్టుబడుతున్నట్లుగా పేర్కొన్నాయి. రఫేల్ జెట్లను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్న ఇండోనేషియాను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే, చైనా తన యుద్ధ విమానాలను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. వాటిని కొనుగోలు చేయాలని ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకువస్తున్నది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ మిస్సైల్స్, యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అయితే, పాక్ వాడిన చైనా తయారు చేసిన ఆయుధాలు, ముఖ్యంగా యుద్ధ విమానాలతో పాటు భారతదేశం వాడిన ఫ్రెంచ్‌లో తయారైన రఫేల్ యుద్ధ విమానాలకు వ్యతిరేకంగా ఎలా పని చేశాయో తెలుసుకునేందుకు సైనిక నిపుణులు ప్రయత్నిస్తున్నారు. మూడు రఫేల్ జెట్లతో సహా ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లుగా పాకిస్తాన్ చెప్పుకుంటున్నది. అయితే, అయితే, ఫ్రెంచ్ వైమానిక దళ చీఫ్ జనరల్ జెరోమ్ బెల్లాంజర్ మాట్లాడుతూ.. ఉద్రిక్తతల సమయంలో భారత్ ఒక రఫేల్ యుద్ధ విమానం.. ఒక సుఖోయ్, మిరాజ్2000 సహా మూడు యుద్ధ విమానాలను మాత్రమే కోల్పోయి ఉండవచ్చన్నారు. ఫ్రాన్స్ రఫేల్ యుద్ధ విమానాలను విక్రయించిన అన్ని దేశాల్లో రఫేల్ లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి.
యుద్ధ విమానం కూల్చివేసినట్లయితే ఆ దేశాన్ని దాని గురించి ప్రశ్నించాలని జెల్లాంజర్ పేర్కొన్నారు. రఫేల్, సంబంధిత పరికరాలు ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతుల్లో కీలకం. వివిధ దేశాలతో ఫ్రాన్స్ సంబంధాలను మెరుగుపరచడానికి ఇది ప్రధాన మార్గం. ముఖ్యంగా ఆసియాలో చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నది. ఈ రోజుల్లో ఫ్రాన్స్ సైతం చైనా ప్రచారాన్ని ఎదుర్కొంటున్నది. ఇందులో పాకిస్తాన్‌తో పాటు చైనా ఉన్నది. సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. రఫేల్ ఫేక్ ఫొటోలను ప్రచారం చేస్తున్నారు. ఏఐతో జనరేటెడ్ కంటెంట్, వీడియో గేమ్ క్లిప్పింగ్‌తో రఫేల్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్-పాక్ మధ్య వివాదం తర్వాత వెయ్యికిపైగా సోషల్ మీడియా ఖాతాలను సృష్టించగా.. అవన్నీ చైనాకు సాంకేతికను ప్రచారం చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. అయితే, ఇందులో చైనా ప్రభుత్వం ప్రమేయం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.