Engineers | న్యూఢిల్లీ : మనిషి తర్వాత తెలివైన జీవులుగా భావిస్తున్న చింపాంజీలు.. ఇంజినీరింగ్, ఫిజిక్స్ నాలెడ్జ్‌ను సంపాదించాయని తాజా అధ్యయనం వెల్లడించింది. చింపాంజీలు నిత్య జీవితంలో ఇంజినీర్లలా వ్యవహరిస్తాయని, సాధనాలను ఎంచుకోవటంలో, తయారు చేసుకోవటంలో ‘ఫిజిక్స్’ వాడుతున్నాయని అధ్యయనంలో తేలింది. వివిధ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం.. చింపాజీలపై జరిపిన అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టాంజానియాలోని గోంబే స్ట్రీమ్ జాతీయ పార్క్‌లోని చింపాంజీల జీవనశైలిని శాస్త్రవేత్తల బృందం దగ్గర్నుంచి విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది. ‘అడవి చింపాంజీలు చెద పురుగుల వేట కోసం నిర్దిష్ట యాంత్రిక లక్షణాలున్న సాధనాలను ఎంచుకుంటున్నాయి’ అని పరిశోధకుడు అలెగ్జాండ్రియా పాస్కల్ చెప్పారు. అత్యంత ప్రయోజనంగా ఉండే వాటిని సాధనాలుగా మలుచుకుంటున్నాయని, నిర్దిష్ట లక్షణాలున్న పదార్థాలను మాత్రమే ఎంచుకుంటున్నాయని నివేదిక పేర్కొన్నది.