కొచ్చి: కేరళలోని కలమస్సేరిలో జరిగిన పేలుళ్లకు తానే బాధ్యుడిని అంటూ డొమినిక్ మార్టిన్(Dominic Martin) పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే జెవోహస్ విట్నెస్స్ గ్రూపుకు వ్యతిరేకంగా మార్టిన్ కొన్ని ఆరోపణలు చేశాడు. ఆ క్రైస్తవ సంఘం తన వార్నింగ్‌లను పట్టించుకోలేదని అతను పేర్కొన్నాడు. ఆ సంఘం కార్యక్రమాలు, ప్రబోధనలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆరోపించాడు. ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోలో అతను కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించాడు. కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లకు బాధ్యుడిని అని ప్రకటించుకున్న అతను .. జెహోవాస్ సంస్థతో 16 ఏళ్లుగా అనుబంధం ఉందని పేరన్కొన్నాడు.
నిజానికి ఆరంభంలో జెహోవాస్ బోధనలను సీరియస్‌గా తీసుకోలేదని, కానీ ఆరేళ్ల క్రితం నాటి నుంచి మాత్రం తన ఆలోచనలు మారినట్లు అతను చెప్పాడు. జెహోవాస్ క్రైస్తవ సంఘం చేస్తున్న బోధనలు దేశవ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపాడు. పద్ధతులు మార్చుకోవాలని వాళ్లకు చెప్పినా వినిపించుకోలేదన్నాడు. మీటింగ్‌లకు హాజరైన వారికి విద్వేష భావాలను జొప్పిస్తున్నారని అతను ఆరోపించాడు. ఎవరితో కలవకూడదని, ఎవరికీ ఆహారాన్ని షేర్ చేయవద్దు అని బోధించారని, అందుకే ఆ సంస్థ విధానాన్ని తప్పుపట్టినట్లు అతను చెప్పాడు. ఆ బోధనలు దేశానికి చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నాడు.
తోటి విద్యార్థి నుంచి చాక్లెట్ తీసుకోవద్దు అని నాలుగేళ్ల పిల్లోడికి బోధించడం ఎంత వరకు సమంజసమని, క్లాస్‌మేట్స్‌ను ద్వేషించే సంస్కృతిని చిన్న పిల్లలకు నేర్పడం అంటే వారి మెదళ్లలోకి విషాన్ని ఎక్కించడమే అవుతుందని మార్టిన్ ఆరోపించాడు. జాతీయ గీతాన్ని ఆలపించరాదు అని ఆ మీటింగ్‌ల్లో నేర్పుతారన్నాడు. పెద్ద పెరిగిన తర్వాత ఓటు వేయవద్దు అని, మిలిటరీలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరవద్దు అని బోధిస్తారని పేర్కొన్నాడు.
కేవలం మీటింగ్‌లకు హాజరయ్యే వ్యక్తుల గురించి మాత్రమే పట్టించుకుంటారని, కేరళ రాష్ట్రమంతా తీవ్ర వరదలు వస్తే, జెహోవా బృందం కేవలం వాళ్ల గ్రూపు సభ్యుల ఇండ్లను మాత్రమే శుభ్రం చేసినట్లు మార్టిన్ ఆరోపించాడు. జెహోవాస్ కాని వారు నాశనం అవుతారన్న బోధనలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు. ఇలాంటి వర్గానికి ఈ దేశంలో స్థానం లేదన్న భావన తనకు కలిగిందన్నాడు.