అంబికాపూర్: ఒక గిరిజన మహిళ మండుటెండలో వాగులు, రాళ్లూ రప్పలు దాటుకొని అడవి మార్గంలో తన 90 ఏండ్ల అత్తను ఎత్తుకొని 9 కి.మీ ప్రయాణించడం అందరినీ కదిలించింది. బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ఈ ఘటన జరిగింది. తన అత్త పెన్షన్ విత్ డ్రా చేయడానికి ఆమెను భౌతికంగా బ్యాంకులో హాజరు పరచడానికి ఆ మహిళ అంత ప్రయాస పడాల్సి వచ్చింది. సర్గుజా జిల్లా మెయిన్పట్ ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఇంటి వద్ద పెన్షన్ చెల్లించే సదుపాయం అటకెక్కడం, పెన్షన్ తీసుకొనే వ్యక్తి తప్పనిసరిగా భౌతికంగా బ్యాంకుకు హాజరు కావాల్సి ఉండటంతో సుఖ్మనియా బాయి తన అత్తను వీపుపై మోసుకొని ఇలా అడవి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ మారుమూల ప్రాంతాల్లో వృద్ధులు, మంచాన పడిన పింఛనుదారులను వెరిఫికేషన్ పేరుతో ఎందుకు కిలోమీటర్ల మేర ప్రయాణించేలా చేస్తున్నారని ప్రభుత్వాలను ప్రశ్నించారు.