Phone Addiction | న్యూఢిల్లీ, ఆగస్టు 11: పొద్దున నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేదాకా.. ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. ఫోన్‌కు అంతలా బానిసలుగా మారిపోయాం. ఈ బానిసత్వాన్ని దూరం చేసేలా చాస్టిటీ బెల్ట్‌ను ‘ది కోచ్’ యాప్ నిర్వాహకులు అభివృద్ధి చేశారు. ఈ బెల్ట్ అచ్చం.. మధ్యయుగ కాలంలో శృంగారం నుంచి మహిళలను కట్టడి చేసేందుకు వాడిన చాస్టిటీ బెల్ట్‌ను పోలి ఉండటం గమనార్హం.
ఆ బెల్ట్‌కు కొంచెం ఆధునికతను జోడించి ఫోన్, కంప్యూటర్ కోసం తయారుచేశారు. దీన్ని రూ.8 వేలకు ది కోచ్ యాప్ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ బెల్ట్‌ను ఫోన్/కంప్యూటర్‌కు తగిలించి, తాళం వేయాలి. తాళం చెవిని నమ్మకస్థులకు ఇచ్చి బానిసత్వాన్ని దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిర్వాహకులు. ఫోన్ వ్యసనాన్ని నిరోధించేందుకు ఇలాంటి పరికరం తీసుకురావడం ప్రపంచంలో ఇదే తొలిసారని వారు చెబుతున్నారు.