జైపూర్: స్కూల్ బాలికలను ఆకట్టుకుని వారిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా మత మార్పిడి చేస్తున్నట్లు కొన్ని కుటుంబాలు ఆరోపించాయి. (schoolgirls exploitation) దీంతో స్థానికులు నిరసనలు చేపట్టారు. బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో ఆ నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్లోని బేవార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మసుదాలో ఒక మతానికి చెందిన వారు మరో మతానికి చెందిన స్కూల్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా బాలికలతో పరిచయం పెంచుకున్నారు. చైనీస్ మొబైల్ ఫోన్లను వారికి బహుమతిగా ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ అమ్మాయిలను లైంగికంగా వేధించారు. ఆ చర్యలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. మతం మారాలని వారిని బలవంతం చేశారు.
కాగా, బాధిత బాలికల కుటుంబాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ విషయం తెలియడంతో స్థానికులు నిరసనలు చేపట్టారు. మసుదా, సమీప ప్రాంతాల్లో మార్కెట్లు మూసివేసి బంద్ పాటించారు. దీంతో మతపరమైన ఆందోళనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు బాధిత బాలికల ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు. మాజీ కౌన్సిలర్ హకీమ్ ఖురేషి, ముగ్గురు మైనర్ బాలురతో సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మసూదా డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. నలుగురు నిందితులైన లుక్మాన్, సోహైల్ మన్సూరి, ర్యాన్ మొహమ్మద్, అఫ్రాజ్ను ఐదు రోజుల పోలీస్ రిమాండ్ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు.