జైపూర్: దేశంలో పరీక్షల నిర్వహణపై నిరసనలు వెల్లువెత్తుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేషన్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ 2026 నిర్వహణలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. రాజస్థాన్లోని జైపూర్ సీతాపుర ప్రాంత సెంటర్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రతి 10, 15 నిమిషాలకోసారి విద్యుత్తు, సర్వర్ల్లో ఇబ్బందుల కారణంగా అభ్యర్థులు సరిగ్గా పరీక్ష రాయలేక పోయారు. ఇలా మూడు గంటల పాటు ఇబ్బందులు కొనసాగాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్ష సెంటర్ బయట ఆందోళనకు దిగారు.
తీవ్ర పోటీ ఉండే ఈ పరీక్షలో ఒక్క మార్కు తేడా వచ్చినా అభ్యర్థుల జాతకాలు గల్లంతవుతాయని, అలాంటిది నిర్దేశిత మూడు గంటల్లో ఎన్నో నిమిషాలు సమయం వృథా కావడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు వాపోయారు. అంతేకాకుండా పరీక్ష సెంటర్లో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. కాగా, విద్యార్థుల ఆందోళనపై స్పందించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సీతాపుర ఐనాన్ డిజిటల్ జోన్ ఐడీజడ్లోని రెండు పరీక్ష సెంటర్లలో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు మాత్రం సెప్టెంబర్ 5న పునః పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఈ రెండు సెంటర్లలో విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా, కొందరికి మాత్రమే పునః పరీక్ష నిర్వహిస్తామనడం పట్ల పలువురు విద్యార్థులు అభ్యంతరం తెలిపారు.