మహబూబాబాద్ రూరల్/తొర్రూరు, ఆగస్టు 24: ఓ మారుమూల తండాలో పుట్టిన గిరిజన బిడ్డలు భూక్య రమేశ్, బానోత్ రమేశ్ దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. చంద్రయాన్-3 విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కమ్యూనికేషన్ విభాగంలో కీలకంగా వ్యవహరించా రు. భారత విజయంలో తమ కుమారులు ఉన్నందుకు వారి తల్లిదండ్రులు, తండావాసులు సంబుర పడుతున్నారు.
మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తండాకు చెందిన భూక్య లక్ష్మి-భీముడు దంపతుల కుమారుడు భూక్య రమేశ్ ఇస్రోలో కొలువు సాధించాడు. నాలుగేండ్లుగా కమ్యూనికేషన్ విభాగంలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. చంద్రయాన్-3 విజయవంతం చేయడంలో 1000 మంది టీమ్‌లో భూక్య రమేశ్ ఒక్కరు కావడం విశేషం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నాతండాకు చెందిన బానోత్ రమేశ్ కూడా శాస్త్రవేత్తల టీమ్‌లో ఉన్నారు. ఏడేళ్లుగా ఇస్రోలో కమ్యూనికేషన్ విభాగంలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు.