బెంగళూరు: చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ జాబిల్లికి మరింత చేరువైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. మరోసారి విజయవంతంగా కక్ష్యను తగ్గించినట్టు తెలిపింది. ప్రస్తుతం సర్క్యులర్ ఆర్బిట్‌కు దగ్గర్లోని 150 X 177 కిలోమీటర్ల కక్ష్యలో చంద్రయాన్-3 తిరుగుతున్నదని పేర్కొంది. ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు మరోసారి కక్ష్యను తగ్గిస్తామని ఇస్రో వెల్లడించింది. ఈ కక్ష్య తగ్గింపు తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ 100 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. అదే సమయంలో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయి ల్యాండింగ్ మాడ్యూల్‌గా మారుతుందని వెల్లడించింది. అనంతరం ప్రయోగంలో కీలకమైన వేగం తగ్గించే ప్రక్రియను చేపడతామని పేర్కొంది. అడ్డంగా ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌ను నిలువుగా మార్చే ప్రక్రియ ఉంటుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 ప్రయోగం ఈ ప్రక్రియ వద్దే విఫలమైందని, ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.