Chandrayaan-3 | న్యూఢిల్లీ: జాబిల్లి రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 తొలి అడుగు విజయవంతమైంది. 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ కాలుమోపుతుంది. 40 రోజుల తర్వాతే శాస్త్రవేత్తలకు అసలైన సవాలు ఎదురవుతుంది.
దేశీయంగా తయారైన పరికరాలే…
ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కేజీలు కాగా, ల్యాండర్ విక్రమ్ బరువు 1,723.89, రోవర్ ప్రజ్ఞాన్ బరువు 26 కేజీలు.
గమ్యాన్ని ఎలా చేరుకుంటుంది?
చంద్రుడి సమీపంలోకి చేరుకున్న తర్వాత ల్యాండర్-రోవర్.. పేలోడ్ ప్రొపల్షన్ నుంచి విడిపోయి ల్యాండ్ అవుతుంది. ఆపై రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై కలియదిరుగుతూ పరిశోధనలు ప్రారంభిస్తుంది.
లేజర్ కిరణాలను ఉపయోగించి..
చంద్రయాన్-3 మూన్కేక్స్, చంద్రుడి నేల కూర్పు, వాతావరణంపై అధ్యయనం చేస్తుంది. సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేసి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ రిసీవర్‌కు పంపుతుంది. అక్కడి నుంచి అది శాస్త్రవేత్తలకు చేరుతుంది. చంద్రుడి కంపనాలపై అధ్యయనం చేసే ప్రజ్ఞాన్ ఫొటోగ్రాఫ్‌లను కూడా పంపుతుంది. ఉపరితలంపై ఓ ముక్కను కరిగించేందుకు, ఈ ప్రక్రియలో విడుదలయ్యే వాయువులను పరిశీలించేందుకు ప్రజ్ఞాన్ లేజర్ కిరణాలను ఉపయోగిస్తుంది.
మొదటి అడుగు వందశాతం సక్సెస్: ఉన్నికృష్ణన్ నాయర్
చారిత్రాత్మక చంద్రయాన్-3 ప్రయోగంలో తొలి అడుగు విజయవంతమైందని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ తెలిపారు. తిరువనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాంచ్ వెహికల్ పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్షనౌకకు అవసరమైన ప్రారంభ పరిస్థితులను చాలా కచ్చితంగా అందించినట్టు తెలిపారు. తొలి అడుగు వందశాతం విజయవంతం కావడంతో తుది అడుగు కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.