న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం గోండా రైల్వే స్టేషన్కు సమీపంలో చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు పక్కకు ఒరిగాయి. పట్టాలు తప్పిన బోగీల్లో ఒకటి పూర్తిగా పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వెలువడ్డాయి. 34 మంది తీవ్రంగా గాయపడ్డారని నార్త్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ సౌమ్య మాథుర్ విలేకరులకు తెలిపారు. మృతుల సంఖ్యపై అధికారులు, మంత్రులు రకరకాలుగా మాట్లాడారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్, జిల్లా కలెక్టర్ నేహా శర్మ.. నలుగురు చనిపోయారని వెల్లడించారు. రైల్వే అధికారి.. ముగ్గురు మృతి చెందారని ప్రకటించారు. ఆ తర్వాత మృతుల సంఖ్యను ఒకటికి తగ్గించారు.
క్షతగాత్రులను వెంటనే దవాఖానకు పంపి వైద్య చికిత్స అందిస్తున్నామని బ్రజేశ్ పాఠక్ చెప్పారు. జిల్లా అధికారులు, విపత్తు సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ‘బుధవారం రాత్రి చండీగఢ్ నుంచి బయల్దేరిన రైలు నెంబర్ 15904 చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్, గురువారం మధ్యాహ్నం 2.37 గంటలకు పట్టాలు తప్పింది’ అని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం ఏం చేస్తున్నది? వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి ఎప్పుడొస్తుంది?’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోదీ సర్కార్ ఒక క్రమపద్ధతిలో రైల్వేను ప్రమాదంలోకి నెట్టింది అనేందుకు తాజా ఘటనే ఉదాహరణ’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు.