Pak Minister : భారతదేశం (India) తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి (Defence minister) ఖవాజా ఆసిఫ్ (Khavaza Asif) వ్యాఖ్యానించారు. అయితే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తాను కోరుకోవడం లేదని చెప్పారు.
పొరుగు దేశంతో ముప్పు పొంచివున్న మాట వాస్తవమని, ఒకవేళ యుద్ధం జరిగితే గతంలో కంటే మెరుగైన ఫలితాలు పాకిస్థాన్ సాధిస్తుందని ఆసిఫ్ విశ్వాసం వ్యక్తంచేశారు. పాకిస్థాన్‌లో ప్రజలంతా ఒకరితో ఒకరు వాదించుకున్నా, విభేదాలు ఉన్నా భారత్‌తో యుద్ధం వస్తే మాత్రం ఐక్యంగా ఉంటామని గొప్పలు చెప్పుకున్నారు. చరిత్రను పరిశీలిస్తే భారత్ ఎప్పుడూ ఒకే దేశంగా లేదని అన్నారు.
కాగా, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల హెచ్చరించారు. భారత్ పూర్తిగా సన్నద్ధంగా ఉందని, ఆపరేషన్ సింధూర్ సమయంలో మాదిరి ఈసారి ఊదాసీనత ప్రదర్శించబోమని ఆయన స్పష్టంచేశారు. పాకిస్థాన్ ప్రపంచ పటంలో నిలబడాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి తీరాలని, లేదంటే ఆ దేశాన్ని చరిత్ర నుంచి తుడిచిపెట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖవాజా పైవిధంగా స్పందించారు.