బిలాస్పూర్: మరణించిన ఉద్యోగుల వివాహిత కుమార్తెలకు కారుణ్య నియామకాలు కల్పించాల్సిందేనని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పథకం కింద అర్హతను నిర్ణయించాల్సింది వైవాహిక స్థితి కాదని, ఉద్యోగిపై ఆధారపడి జీవించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహితులైన కుమారులకు వర్తించే ప్రయోజనం, ఆధారపడి ఉన్నారనే పరీక్షకు అర్హత సాధిస్తే కుమార్తెలకు కూడా సమానంగా వర్తిస్తుందని పేర్కొంది.
మహిళలు వివాహితులు అనే ఏకైక కారణంతో వారి దరఖాస్తులను తిరస్కరించడం ఏకపక్షం, వివక్షా పూరితం, చట్టపరంగా సమర్థనీయం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. బిలాస్‌పూర్‌కు చెందిన షీనా డేవిడ్(33) రాయ్‌పూర్‌కు చెందిన అంకితా మిశ్రా(32) దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వారి తండ్రులు నోయోల్ శైలేంద్ర కుమార్ జాన్స్(బ్రాంచ్ మేనేజర్), మందన్ కుమార్ పాండా(ఆఫీస్ అసిస్టెంట్) ఛత్తీస్‌గఢ్ గ్రామీణ బ్యాంకులో సర్వీసులో ఉండగానే మరణించారు. వీరి విద్యార్హతలకు తగిన పోస్టుల్లో 90 రోజుల్లోగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని బ్యాంకు యాజమాన్యాన్ని ఆదేశించింది.