న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పాన్ మసాలా తయారీపై విధించిన ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 14,000 కోట్ల ఆదాయం లభించగలదని ప్రభుత్వం అంచనా వేసింది. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు అమల్లోకి వచ్చింది. సిగరెట్లపై అత్యధికంగా విధించిన 40 శాతం జీఎస్టీ రేటు కన్నా అధికంగా పాన్ మసాలాపై ప్రభుత్వం సెస్సు విధించింది. ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు చట్టం పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు విధించేందుకు అనుమతినిస్తుంది. 40 శాతం జీఎస్టీని కూడా పరిగణనలోకి తీసుకుంటే పాన్ మసాలాపై విధించే మొత్తం పన్ను దాదాపు 88 శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల్లో(ఫిబ్రవరి, మార్చి) ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు నుంచి రూ.2,300 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని ప్రభుత్వం ఆశిస్తున్నది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,000 కోట్ల ఆదాయం దీని ద్వారా వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. పాన్ మసాలా తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంపై విధించే సెస్సు నుంచి లభించే ఆదాయాన్ని ఆరోగ్య అవగాహన లేదా ఆరోగ్య సంబంధిత పథకాలు లేదా కార్యకలాపాల ద్వారా రాష్ర్టాలతో కేంద్రం పంచుకోనున్నది. జాతీయ ప్రాధాన్యతా అంశాలైన ఆరోగ్యం, జాతీయ భద్రతకు నిరంతరాయంగా, కచ్చితంగా నిధులను సమకూర్చే లక్ష్యంతో ఈ ఆరోగ్య సెస్సును ప్రభుత్వం సృష్టించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. పాన్ మసాలాపై సెస్సు, పొగాకుపై ఎక్సైజ్ సుంకాన్ని విధించాలన్న ప్రతిపాదనకు డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం లభించింది.