న్యూఢిల్లీ, మే 28: తన అధికారిక నివాసంలో స్వాధీనం చేసుకున్న కాలిపోయిన నగదుపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఆయనను అభిశంసించవచ్చని నివేదిక పేర్కొంది. జస్టిస్ వర్మ ఇంట్లో లభించిన కాలిపోయిన కరెన్సీ నోట్ల ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందచేసింది. ఈ నివేదికలోని వివరాలు ఇండియా టుడే సంపాదించింది.
జస్టిస్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూములో దాదాపు 1.5 అడుగుల ఎత్తున కాలిపోయిన కరెన్సీ నోట్ల గుట్ట లభించినట్లు నివేదిక పేర్కొంది. మార్చి 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించినపుడు ఈ నోట్ల గుట్టలు లభించాయి. ఘటన జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. ఈ ఘటన నేపథ్యంలో ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు కొలిజీయం బదిలీ చేసింది. జస్టిస్ వర్మకు వ్యతిరేకంగా పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్న సమయంలో ఈ నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది.
తన ఇంట్లో లభించిన కాలిపోయిన కరెన్సీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో జస్టిస్ వర్మ వివరణ ఇవ్వలేదని నివేదిక తెలిపింది. తనపైన కుట్ర జరిగిందని ఆయన ఆరోపించినట్లు నివేదిక పేర్కొంది. తనకేమీ సంబంధం లేదని ఖండించడం, కుట్ర జరిగిందని చెప్పడం తప్ప ఆయన నోటి నుంచి వేరే వివరణ రాలేదని నివేదిక పేర్కొంది.
మార్చి 14-15 రాత్రి మంటలు చెలరేగిన రోజున జస్టిస్ వర్మకు చెందిన 30-తుగ్లక్ క్రీసెంట్ నివాసంలో ఆయన కుమార్తెతోసహా 17 మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది. కాలిపోయిన నగదు లభించిన స్టోర్ రూము జస్టిస్ వర్మ, ఆయన కుటుంబం అధీనంలోనే ఉందని తెలిపింది. జడ్జి చేసిన కుట్ర ఆరోపణను ప్రస్తావిస్తూ స్టోర్ రూముకు తాళం వేసి ఉన్న కారణంగా బయటి వ్యక్తులు ఆ గదిలోకి వచ్చే అవకాశం లేదని, ఆ గది జస్టిస్ వర్మకు, ఆయన కుటుంబానికి మాత్రమే అందుబాటులో ఉందని నివేదిక స్పష్టం చేసింది.
మంటలు చెలరేగిన తర్వాత స్టోర్ రూము నుంచి కాలిపోయిన కరెన్సీని తొలగించడానికి జడ్జీకి చెందిన సిబ్బంది ప్రయత్నించినట్లు దర్యాప్తులో తెలిసిందని నివేదికలో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి రాజేందర్ సింగ్ కర్కీ పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ మంటల గురించి ముందుగా జడ్జీకి తెలియచేసింది కర్కీయేనని తెలిపారు.