చెన్నై: చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఆదివారం వెల్లడించారు. చంద్రుడిపై అధ్యయనానికి చంద్రయాన్ 3లో 25 కిలోల రోవర్‌ను పంపించగా, చంద్రయాన్-5లో 250 కిలోల రోవర్‌ను పంపించనున్నట్టు ఆయన తెలిపారు. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల కిందటే చంద్రయాన్ -5కి కేంద్రం నుంచి ఆమోదం లభించిందని, జపాన్ సహకారంతో ఈ ప్రయోగం నిర్వహించనున్నట్టు నారాయణన్ చెప్పారు. చంద్రుడి నమూనాలు తీసుకొని వచ్చేందుకు 2027లో చంద్రయాన్-4ను ప్రయోగించనున్నట్టు వెల్లడించారు.