న్యూఢిల్లీ: అమెరికాలో 55 మందిలో ఇన్ఫెక్షన్కు కారణమైన ఐ డ్రాప్స్ తయారీపై కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)’ సస్పెన్షన్ విధించింది. భారత ఐ డ్రాప్స్‌ను వాడటంవల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని గుర్తించిన ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)’ అక్కడ ఆ ఐ డ్రాప్స్ వాడకంపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని భారత ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకొచ్చింది. దాంతో సీడీఎస్‌సీవో ఆ డ్రాప్స్ తయారీని నిలిపివేయాలని ఆదేశించింది.
అంతేగాక, ఈ ఘటనపై సీడీఎస్‌సీవో దర్యాప్తును కూడా ప్రారంభించింది. సీడీఎస్‌సీవోకు చెందిన ముగ్గురు, తమిళనాడు స్టేట్ డ్రగ్ కంట్రోలర్‌కు చెందిన ముగ్గురు అధికారులు చెన్నై సమీపంలోని ఎజ్రికేర్ ఫార్మా కంపెనీకి వెళ్లి వికటిత ఐ డ్రాప్స్‌ను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అమెరికాకు చెందిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ఈ విషయంలో దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ ఎజ్రికేర్ సంస్థ కాంట్రాక్టు పద్ధతిలో తమిళనాడుకే చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఐ డ్రాప్స్ తయారు చేసి ఇస్తుంది.
గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రవేట్ లిమిటెడ్ ఆ ఐ డ్రాప్స్ అమెరికాకు ఎగుమతి చేస్తున్నది. ఎజ్రికేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ లేదా డెల్సమ్ ఫార్మా ఆర్టిఫిషియల్ టియర్స్ పేరుతో ఈ ఐ డ్రాప్స్ తయారవుతున్నాయి. ఇటీవల ఈ ఐ డ్రాప్స్‌ను వాడటంవల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు చూపును కోల్పోయారు. మిగతావాళ్లు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో అప్రమత్తమైన గ్లోబల్ ఫార్మా తన వికటిత ఐ డ్రాప్స్‌ను స్వచ్ఛందంగా వెనక్కి రప్పిస్తున్నది.
ఆ వికటించిన ఐ డ్రాప్స్‌లో సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు నిపుణుల పరిశీలనలో తేలింది. ఈ బ్యాక్టీరియా ఐ డ్రాప్స్ వేసుకోగానే బాధితుల ఊపితిత్తులు, కాలేయం తదితర అవయవాల్లో ఇన్ఫెక్షన్కు దారితీస్తున్నదని రుజువైంది. దీనిపై అమెరికాకు చెందిన ఎఫ్డీఏతోపాటు కేంద్ర, తమిళనాడు ఆరోగ్య శాఖల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నది.