న్యూఢిల్లీ: సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్‌ను 35 ముక్కలుగా కోసి చంపిన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు చెందిన కీలక ఆధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించారు. అక్టోబర్ 18వ తేదీన అతను ఓ బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. గర్ల్‌ఫ్రెండ్ శ్రద్ధా శరీర భాగాలను పడేసేందుకు అతను ఆ బ్యాగ్‌ను వాడినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్ వేసుకుని మూడుసార్లు రౌండ్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు.
శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాల కోసం మెహరౌలీ అడవిలో వరుసగా ఆరో రోజు పోలీసులు వెతికారు. మర్డర్ జరిగిన రోజున తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. నిందితుడు మారిజోనా తీసుకునేవాడని విచారణలో తెలిసింది. ఈ కేసులో విచారణ కోసం మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పోలీసులు వెళ్లారు.
స్నేహితులు, ఆఫీసు సహోద్యోగులతో శ్రద్ధా చేసిన వాట్సాప్ చాటింగ్‌కు చెందిన స్క్రీన్షాట్లు బయటకు వచ్చాయి. అయితే శ్రద్ధాను అఫ్తాబ్ చాలా హింసించినట్లు ఆ చాటింగ్ ద్వారా తెలుస్తోంది. శ్రద్ధా ముఖానికి, మెడకు గాయాలైన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.