న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన అవినీతి కేసులో మాజీ రక్షణ కార్యదర్శి శశి కాంత్ శర్మ, మాజీ ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్లపై చార్జిషీట్‌ను సీబీఐ బుధవారం దాఖలు చేసింది. రూ.3,200 కోట్ల కుంభకోణంలో మాజీ రక్షణ కార్యదర్శి శశి కాంత్ శర్మ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సీబీఐకి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం దాఖలు చేసిన అదనపు చార్జిషీట్లో శశి కాంత్ శర్మ పేరుతోపాటు ఈ కేసుతో సంబంధమున్న నలుగురు ఐఏఎఫ్ మాజీ సీనియర్ అధికార్ల పేర్లను అందులో పేర్కొంది.
కాగా, శశి కాంత్ శర్మ 2003-07 మధ్య రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (ఎయిర్), 2011-13 మధ్య రక్షణ కార్యదర్శిగా, 2013-17 మధ్య ఆడిటర్‌గా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ టెస్టింగ్ పైలట్ ఎస్ఏ కుంతే, వింగ్ కమాండర్ థామస్ మాథ్యూ, గ్రూప్ కెప్టెన్ ఎన్ సంతోష్‌లను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని కూడా సీబీఐ కోరింది.
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇతర ప్రముఖుల కోసం 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు నాటి యూపీఏ ప్రభుత్వం హయాంలో అగస్టావెస్ట్‌ల్యాండ్ సంస్థతో ఒప్పందం కుదిరింది. కాగా, భారత వాయు సేన సూచించిన ప్రమాణాలు లేకపోయినా ఈ డీల్ కుదరడంతో కోట్లాది ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో 2016 నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. 2017 సెప్టెంబరు 1న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగితో పాటు మరో 11 మందిపై తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. డీల్‌కు సంబంధించిన ముగ్గురు మధ్యవర్తుల్లో ముఖ్యమైన క్రిస్టియన్ మిచెల్‌ను 2018లో భారత్‌కు రప్పించారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు.