న్యూఢిల్లీ: పార్లమెంటులో గౌతమ్ అదానీ కంపెనీలను, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభ నైతిక విలువల కమిటీ (Ethics Committee) ముందు హాజరుకానున్నారు. నవంబర్ 2న తాను ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరవుతానని మంగళవారం సాయంత్రం మహువా మొయిత్రా వెల్లడించారు.
అయితే తనపై వచ్చిన నేరారోపణలపై విచారించేందుకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సరైన వేదికేనా..? అని మహువా మొయిత్రా ప్రశ్నించారు. పార్లమెంటరీ కమిటీలకు నేరారోపణలను విచారించే అధికార పరిధి లేదని, ఇటువంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని కూడా విచారణకు పిలువాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. కాగా, అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదుతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని భాజపా ఎంపీ నిషికాంత్ దూబే ఇటీవల ఆరోపించారు.
ఆ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయగా వ్యవహారం లోక్‌సభ నైతిక విలువల కమిటీ వద్దకు చేరింది. తొలుత అక్టోబరు 31న నే విచారణకు హాజరు కావాలని ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. అయితే అప్పటికే షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, నవంబర్ 5వ తేదీ తర్వాత విచారణ తేదీని ఖరారు చేయాలని మహువా మొయిత్రా అభ్యర్థించారు. మహువా విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఎథిక్స్ కమిటీ నవంబర్ 2న తమ ముందుకు వచ్చి మౌఖిక సాక్ష్యం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో ఆమె నవంబర్ 2న కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు.