న్యూఢిల్లీ, జనవరి 31: ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ, ఆయన తమ్ముని కుమారుడు సాగర్ అదానీ సివిల్ మోసం కేసులో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ) నుంచి లీగల్ నోటీసులు స్వీకరించడానికి అంగీకరించారు. దీంతో విధానపరమైన ప్రధాన అడ్డంకి తొలగిపోయి న్యూయార్క్ బ్ల్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టులో కేసు విచారణ ముందుకు సాగడానికి మార్గం సుగమమైంది.
న్యూయార్క్ తూర్పు డిస్ట్రిక్ట్ కోర్టు ఎదుట హాజరైన అదానీల తరఫు న్యాయవాదులు తమ కక్షిదారుల తరఫున ఎస్ఈసీ సమన్లను స్వీకరించడానికి అంగీకారం తెలిపారు. ఎస్ఈసీ ఆదేశాలకు లోబడి ఉంటామని న్యాయవాదులు అంగీకరించినప్పటికీ అధికార పరిధితో సహా అన్ని కారణాలతో కేసును సవాల్ చేసే హక్కు ప్రతివాదులకు ఉంటుందని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ఈసీ ఫిర్యాదుపై తమ స్పందనను దాఖలు చేసేందుకు గౌతమ్, సాగర్ అదానీకి 90 రోజుల వ్యవధి ఉంటుంది.
అవసరమైతే దీనికి జవాబు దాఖలు చేసేందుకు ఎస్ఈసీ 60 రోజుల వ్యవధి ఉంటుంది. ఆ తర్వాత ప్రతివాదులు తమ సమాధానాలను మళ్లీ దాఖలు చేసుకోవచ్చు. భారత్లో అదానీ గ్రీన్ ఎనర్జీ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన లంచం పథకం విషయంలో గౌతమ్, సాగర్ అదానీ అమెరికా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారని, అమెరికా సెక్యూరిటీ చట్టాలు, విదేశీ అవినీతి పద్ధతుల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.