కొరియా: చత్తీస్‌ఘడ్‌లో దారుణం జరిగింది. సాండ్ మైనింగ్ వివాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నది. ఫార్చూనర్ వాహనానికి నిప్పుపెట్టడంతో దాంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన కోరియా జిల్లాలో జరిగింది. ప్లాన్ ప్రకారం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ట్రక్కుల మధ్య ఫార్చూనర్ వాహనాన్ని ట్రాప్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. మృతుల్లో స్థానిక బీజేపీ నేత, మాజీ పంచాయతీ ప్రెసిడెంట్ భరత్ సింగ్ ఉన్నారు. సోనాహట్ పోలీసు స్టేషన్ పరిధిలోని నౌగెయిన్ గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఇసుక మైనింగ్ ఆపరేషన్‌కు చెందిన ఓ సమస్య పరిష్కారం కోసం భరత్ సింగ్ చర్చలకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కానీ అతన్ని ట్రాప్ చేసి చంపారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాశ్ త్రిపాఠి, మన్ను త్రిపాఠిలను అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. మొత్తం 9 మందిపై మర్డర్ కేసు నమోదు చేశారు.
ఈ మర్డర్ ఘటనతో కొరియా జిల్లాలో తీవ్ర అలజడి రేగుతోంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక ఇసుక వ్యాపారాన్ని భతర్ సింగ్ కుటుంబానికి ప్రభుత్వం అప్పగించింది. అయితే సోనాహట్, కైలాష్‌పూర్, తేలిముడ, బేలియా, చిన్గుర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ అంశంలో వివాదం మొదలైంది. భరత్ సింగ్ ఫ్యామిలీతో పాటు మరో బీజేపీ నేత మనోజ్ త్రిపాఠి కుటుంబం మధ్య చాన్నాళ్లుగా మైనింగ్ పట్టు కోసం వార్ నడుస్తోంది. త్రిపాఠి ఫ్యామిలీ వద్ద టిప్పర్ ట్రక్కులు ఉన్నాయి. అయితే పేమెంట్ అంశంలో రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఘటన జరిగిన రాత్రి.. భరత్ సింగ్ వాహనాన్ని ట్రక్కులతో చుట్టు ముట్టారు. ఫార్చూనర్‌కు ముందు, వెనుక లారీలను నిలిపి, ఎటు కదలకుండా బంధీ చేసి, ఆ తర్వాత వాహనానికి నిప్పు పెట్టారని పోలీసులు చెప్పారు. భరత్ సింగ్ అనే వ్యక్తి కారులోనే సజీవ దహనమైనట్లు గుర్తించామన్నారు. మృతుల్లో వీరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ కూడా ఉన్నారు. మయాంక్ సింగ్ అనే మరో వ్యక్తి బిలాస్‌పూర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న భరత్ సింగ్.. భూపేశ్ భగేల్ ప్రభుత్వ సమయంలో బీజేపీలో చేరారు.
మైనింగ్ ఏరియాలో భరత్ సింగ్ అంటే అందరికీ భయమే. తన ఫార్చూనర్ వాహనానికి అతను హూటర్ పెట్టుకుని తిరిగేవాడు. అయితే ఈ మర్డర్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే అటాక్ చేశారని ఆరోపించారు.
అయితే భరత్ సింగ్ కారు అగ్నిప్రమాదానికి ఎలా గురైందో తెలియదని పోలీసులు చెబుతున్నారు. ఆ కోణంలో ఇంకా దర్యాప్తు చేపడుతున్నామన్నారు. భరత్ సింగ్ మర్డర్ పట్ల స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. సీఎం విష్ణుడియో సాయి కూడా స్పందించారు. ఆ కేసులో అరెస్టులు చేశమని, తదుపరి దర్యాప్తు కూడా జరుగుతోందన్నారు. నిందితులను వదిలేదిలేదన్నారు.