అల్వార్: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగింది. కదులుతున్న కారులో మంటలు వ్యాపించాయి. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్న అయిదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని అల్వార్ జిల్లాలో జరిగింది. బుధవారం రాత్రి మౌజ్‌పూర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కారులో ఉన్న ప్రయాణికులు.. వైష్ణవీదేవి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్నారు. అదనపు ఎస్పీ ప్రియాంకా రఘువంశీ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బందిని పంపామన్నారు. 15 నిమిషాల్లోనే మంటల్ని అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందన్నారు. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ మైనర్ బాలిక, మరొకరు ఉన్నట్లు గుర్తించారు.
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాకు చెందిన నివాసితులగా వారిని అనుమానిస్తున్నారు. బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల కారులో మంటలు వ్యాపించి ఉంటాయని డిప్యూటీ ఎస్పీ కైలాశ్ జిందాల్ తెలిపారు. సీఎన్జీ వాహనం కావడం వల్ల షార్ట్ సర్క్యూట్ కోణంలో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నామన్నారు. చాలా వేగంగా కారులో మంటలు వ్యాపించాయని, ప్రయాణికులకు తప్పించుకునే సమయం కూడా దొరకలేదన్నారు. వాహనం నుంచి కేవలం కళేబరాలను వెలికితీసినట్లు చెప్పారు. వారిని గుర్తుపట్టేందుకు డీఎన్ఏ పరీక్షలు చేపట్టనున్నారు. కారు డ్రైవర్ వినోద్ కుమార్ వాహనం నుంచి బయటకు దూకాడు. కానీ అతని శరీరం 80 శాతం కాలింది. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేపట్టనున్నారు.