జమ్ము, జూన్ 13: ‘మా రక్తాన్ని ధారపోసేందుకు, మా పిల్లలను అనాథలను చేసేందుకు, మా భార్యలను వితంతువులుగా మార్చేందుకు మమ్మల్ని మళ్లీ కశ్మీర్ తీసుకురాకండి’ అని కశ్మీరీ పండిట్లు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను వెంటనే కశ్మీర్ లోయ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ జమ్ములోని ప్రెస్ క్లబ్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ రక్తపాతానికి పరిష్కారం తమకు కశ్మీర్ ఆవల ఉపాధి, నివాస సదుపాయం కల్పించడమేనన్నారు. కశ్మీర్లో పనిచేయాలంటే భయంగా ఉందని శ్వేతా భట్ అనే ఉద్యోగిని చెప్పారు. భయంతో పనిపై దృష్టి పెట్టలేకపోతున్నామని అన్నారు.