న్యూఢిల్లీ: విద్యుత్ చౌర్యం హత్యతో సమానం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన నిందితుడికి ఏకంగా 18 ఏళ్లు జైలు శిక్ష విధించడంపై అత్యున్నత న్యాయస్థానం షాక్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నిందితుడికి విధించిన 18 ఏళ్ల జైలు శిక్షను రెండేళ్లకు కుదించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి విద్యుత్ చౌర్యానికి పాల్పడటంతో అతడిపై 9 కేసులు నమోదు చేసి 2019లో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన దిగువ కోర్టు అన్ని కేసుల్లో అతడ్ని దోషిగా నిర్ధారించింది. ఒక్కో కేసుకు రెండేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున విధించిన జైలు శిక్షను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ఆదేశించింది. దీంతో ఆ వ్యక్తి ఏకంగా 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
కాగా, 2019లో అరెస్ట్ చేసినప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున విధించిన జైలు శిక్షను ఒకేసారి అమలు చేయాలని కోరుతూ లక్నో హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాలని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై విస్మయం వ్యక్తం చేసింది.
మరోవైపు నిందితుడి అభ్యర్థనను తిరస్కరించాలన్న యూపీ ప్రభుత్వం తరుఫు న్యాయవాదిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విద్యుత్ చౌర్యం హత్యతో సమానం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇది పౌరుల స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ‘ఇలాంటి పిటిషనర్ల ఆర్తనాదాలు వినడానికే సుప్రీం కోర్టు ఉంది. మాకు చిన్నా పెద్దా అనే తేడా లేదు. రోజూ ఇలాంటి కేసులు ఎన్నో వస్తుంటాయి. కరెంట్ దొంగిలించినందుకు ఎవరినైనా 18 ఏళ్లు జైలుకు పంపుతున్నామా?’ అని ప్రశ్నించారు. ఆ వ్యక్తికి విధించిన 18 ఏళ్ల జైలు శిక్షను రెండేళ్లకు కుదించారు. దీంతో ఇప్పటి వరకు మూడేళ్లపాటు జైల్లో ఉన్న అతడికి స్వేచ్ఛ లభించింది.