Head soup : ఇద్దరిని క్రూరంగా హత్య చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) కు చెందిన సీరియల్ కిల్లర్ (Serial Killer) రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్ (Raja Kolandar), అతడి సహచరుడు బక్ష్‌రాజ్ (Baksh Raj) కు జీవితఖైదు పడింది. లక్నో కోర్టు శుక్రవారం వారికి జీవిత ఖైదు విధించింది. కోలందర్ నరమాంస భక్షకుడని, మనిషి తలతో చేసిన సూప్ తాగడానికి ఇష్టపడేవాడని ఆరోపణలు ఉన్నాయి.
అయితే జడ్జి శిక్ష విధిస్తున్న సమయంలో కోలందర్ కోర్టు గదిలో నవ్వుతూ కనిపించాడు. అతడిలో ఎటువంటి పశ్చాత్తాపం, భయం కనిపించలేదు. ఇదిలావుంటే ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జర్నలిస్టు ధీరేంద్రసింగ్ హత్య కేసులో కోలందర్‌పై మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు అతడి బండారం బయటపడి, అనేక ఇతర నేరాలు వెలుగులోకి వచ్చాయి.
ధీరేంద్రసింగ్ హత్యకేసు దర్యాప్తు కోసం పోలీసులు కోలందర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లగా అక్కడ మనుషుల పుర్రెలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని కోలందర్‌ను ప్రశ్నించగా.. పాతికేళ్ల కిందట 2000 సంవత్సరంలో మనోజ్ అనే వ్యక్తిని, అతడి డ్రైవరు రవిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు కోలందర్, బక్ష్‌రాజ్ వెల్లడించారు.
జర్నలిస్ట్ ధీరేంద్రను పిప్రీలోని తన ఫామ్‌హౌస్‌కు పిలిపించి చంపినట్లు కోలందర్ తెలిపాడు. ఇతడి ఇంట్లో 14 హత్యలను ప్రస్తావించిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా శంకర్‌గఢ్‌కు చెందిన కోలందర్ మొదట్లో ఛోకిలోని సెంట్రల్ ఆర్డినెన్స్ స్టోర్‌లో క్లాస్ 4 ఉద్యోగి. తనను తాను రాజుగా భావించే రామ్ నిరంజన్ పేరులో ‘రాజా’ చేర్చుకున్నాడు. భార్యను సైతం ‘పూలన్‌దేవి’ అని పిలుస్తాడు.