Cancer cases : దేశంలో తల (Head), మెడ (Neck) భాగాల్లో వచ్చే క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని మొత్తం క్యాన్సర్ కేసులలో తల, మెడ భాగాలకు సంబంధించిన క్యాన్సర్ కేసులే 26 శాతం ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. దాదాపు 1,869 మంది క్యాన్సర్ రోగుల మీద చేసిన ఈ పరిశోధన ఫలితాలను ‘వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే (World Head and Neck Cancer Day)’ సందర్భంగా శనివారం వెల్లడించారు.
ఢిల్లీకి చెందిన ‘క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ (Cancer Mukt Bharat Foundation)’ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 30 వరకు ఫౌండేషన్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్ కాల్స్ డాటాను విశ్లేషించి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంపై క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ అశీశ్ గుప్తా మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు.
ముఖ్యంగా యువతలో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. పొగాకు వినియోగం, పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షనే ఇందుకు కారణమని అన్నారు. సుమారు 80 నుంచి 90 శాతం ఓరల్ క్యాన్సర్ కేసులు ఏదో ఒక రూపంలో పొగాకును తీసుకోవడం వల్లనే సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. మిగతా క్యాన్సర్లతో పోల్చితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నివారించదగినదని, అలవాట్లను మార్చుకుంటే అదుపులో పెట్టుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.