భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నియోజకవర్గంలో కాలువ మాయమైంది. (Canal Land ‘Disappears) సాగునీటి కోసం ఏళ్ల కిందట రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన కాలువ భూమి ఆక్రమణలకు గురైంది. ఈ విషయం తెలిసిన ఇరిగేషన్ అధికారులు అయోమయంలో పడ్డారు. మాయమైన కాలువ భూమిని గుర్తించేందుకు రెవెన్యూ శాఖను ఆశ్రయించారు.
కాగా, దౌలత్పురా, మదంఖేడలో రైతులకు సాగునీటి కోసం ఒక కాలువను ప్రభుత్వం నిర్మించింది. బెత్వా నదికి సమీపంలో ఉన్న ఈ కాలువ అక్కడి వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. అయితే కాలక్రమేణా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్ల ఆ కాలువ అదృశ్యమైంది. ఈ విషయం తెలిసి నీటిపారుదల శాఖ అధికారులు షాక్ అయ్యారు. మిస్సింగ్ కాలువ భూమిని గుర్తించాలంటూ రెవెన్యూ శాఖను కోరారు. అలాగే కాలువ ఒడ్డున ఏర్పాటు చేసిన లక్షల విలువ చేసే వాటర్ లిఫ్టింగ్ మిషన్ కూడా చోరీ కావడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.
మరోవైపు కాలువ మాయం విషయం తన దృష్టికి వచ్చిందని జిల్లా కలెక్టర్ బుద్దేష్ కుమార్ వైద్య తెలిపారు. కాలువ భూమిని ఎవరు ఆక్రమించారో అన్నదానిపై సమగ్రంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడుకుంటామని వెల్లడించారు.