Justin Trudeau | టొరంటో, అక్టోబర్ 24: తన దురుసు వ్యాఖ్యలు, అసంబద్ధ ఆరోపణలతో కయ్యానికి కాలుదువ్వుతూ భారత్తో దౌత్య సంబంధాలు తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఆ దేశంలో పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. వాటి నుంచి దారి మళ్లించడానికే ఆయన భారత్తో ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సొంత లిబరల్ పార్టీకి చెందిన పలువురు నేతలు ట్రూడో వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాక, అతడిని పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తొమ్మిదేండ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఆయన దానిలో కొనసాగడానికి తన నిబద్ధతను పునరాలోచించాలని పార్టీలోని పలువురు ఉదారవాదులు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా ట్రూడో ప్రతిష్ట మసకబారుతూ వస్తున్నది. ఆయన సొంత పార్టీ ఎంపీలే ఆయన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండి ఆయనకు వ్యతిరేకంగా మిగతా సభ్యులతో సమావేశమై రహస్య మంతనాలు జరుపుతున్నారు.
బుధవారం ట్రూడో నేతృత్వంలో జరిగిన సమావేశంలో 153 మంది సభ్యులున్న పార్టీలో 20 మందికి పైగా సభ్యులు ఆయన వచ్చే ఎన్నికలకు ముందే పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. అక్టోబర్ 28లోపు ట్రూడో తన భవిష్యత్తును ఎంచుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సుమారు 25 మంది సభ్యులు సంతకం చేసిన లేఖలో హెచ్చరించారు. దీంతో ఇప్పటికే మైనారిటీలో ఉన్న ఆ ప్రభుత్వానికి చిక్కులు తప్పేటట్టు లేదు. అయితే సమావేశం అనంతరం బయటకు వచ్చిన ట్రూడో తమ పార్టీ సభ్యులంతా ఐక్యంగా ఉన్నట్టు ప్రకటించారు.
నాలుగో పర్యాయం జస్టిన్ ట్రూడో ప్రధాని పదవిలో కొనసాగడానికి పలువురు పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. ఆయన నేతృత్వంలో పార్టీ ఎన్నికలకు వెళితే తీవ్ర పరిణామాలు తప్పవని వారు అంటున్నారు. ఇటీవల తమ పార్టీకి మంచి పట్టున్న టొరంటో, మాంట్రియల్లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలు కావడంతో ట్రూడో నాయకత్వంపై పార్టీలో సందేహాలు మరింత అధికమయ్యాయి. ప్రస్తుతం పార్లమెంట్లో పూర్తి మెజారిటీ లేని లిబరల్ పార్టీ 2025లో జరిగే ఫెడరల్ ఎన్నికల్లో కనీసం ఒక పెద్ద పార్టీ మద్దతు అయినా కోరుకుంటున్నది. కొవిడ్-19 తర్వాత దేశంలో జీవన వ్యయం పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల నానోస్ పోల్ జరిపిన సర్వేలో అధికార లిబరల్ పార్టీ విపక్ష కన్జర్వేటీవ్ల కన్నా 38 నుంచి 25 శాతం వెనుకబడి ఉంది. దీంతో ట్రూడో నేతృత్వంలో వచ్చే ఎన్నికలకు వెళితే ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని పార్టీ నేతలు భయపడుతున్నారు.
మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యం కోసం కెనడాలోని జస్టిన్ ట్రూడో సర్కార్ వలసదారులను టార్గెట్ చేసుకుంది. రాబోయే సంవత్సరం నుంచి వలసలను పెద్ద ఎత్తున నియంత్రించేందుకు సరికొత్త వలస విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. కెనడాలో ఆశ్రయం కల్పిస్తున్న తాత్కాలిక నివాసితులు, శాశ్వత నివాసితుల సంఖ్యను తగ్గించబోతున్నట్టు కెనడా తెలిపింది. ఈ ఏడాది కెనడాలో మొత్తం 4,85,000 మందికి శాశ్వత నివాస హోదా కల్పించగా, దీనిని 2025లో 3,95,000కు, 2027నాటికి 3,65,000కు తగ్గించబోతున్నట్టు ట్రూడో సర్కార్ వెల్లడించింది.