న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింతగా దిగజారాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య ప్రతిష్టంభన గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రెస్మీట్లో మాట్లాడారు. దీనిని ప్రసారం చేసిన ఆస్ట్రేలియా మీడియా సంస్థను కెనడా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో కెనడా హిపోక్రసీపై భారత్ మండిపడింది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభనపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన మాధానమిచ్చారు.
కాగా, జైశంకర్ ప్రెస్‌మీట్ జరిగిన కొన్ని గంటల తర్వాత కెనడా స్పందించింది. దీనిని ప్రసారం చేసిన భారతీయ కమ్యూనిటీకి చెందిన ఆస్ట్రేలియా టుడేపై నిషేధం విధించింది. దీనిపై భారత్ మండిపడింది. కెనడా చర్య వింతగా అనిపించిందని, తమను ఆశ్చర్యానికి గురి చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పట్ల కెనడా హిపోక్రసీని ఇది తెలియజేస్తోందని విమర్శించారు.
మరోవైపు వారాంతంలో నిర్వహించే టొరంటోలోని కాన్సులర్ క్యాంపును భారత్ రద్దు చేసింది. కెనడాలోని హిందూ ఆలయంపై దాడి నేపథ్యంలో భద్రతా కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాన్సులర్ క్యాంప్ నిర్వహణ కోసం కెనడా ప్రభుత్వం నుంచి భద్రతా పరమైన హామీ లభించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆరోపించారు. అందుకే భారత పౌరుల సేవల కోసం రోటీన్‌గా వీక్‌ఎండ్‌లో నిర్వహించే ఈ శిబిరాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.