Special Trains | దీపావళి, ఛట్‌పూజ పండుగల సందర్భంగా 2వేల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రెండులక్షల మంది ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. కేబినెట్ రెండు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. ఏపీ రాజధాని అమరావతి రైల్వేలైన్‌కు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
కృష్ణా నదిపై కొత్తగా 3.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మించనున్నట్లు చెప్పారు. అమరావతిని హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, నాగ్‌పూర్‌తో అనుసంధానించనున్నట్లు తెలిపారు. అలాగే. ఉత్తర బిహార్‌ను ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించేందుకు నార్కటియాగంజ్ – రక్సాల్, సీతామర్హి, దర్భంగా – సీతామర్హి ముజఫర్‌పూర్ మార్గాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. రూ.4553కోట్ల వ్యయంతో 256 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ నిర్ణయంతో ఉత్తరప్రదేశ్, ఉత్తర బిహార్‌లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ.1000కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు.