న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాలను సవరించడానికి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సంఘానికి చైర్మన్, ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తామని ఆయన తెలిపారు. ఏడో వేతన సంఘం గడువు 2026లో ముగియనుంది. ఈలోపే ఎనిమిదో వేతన సంఘం సిఫారసులు వచ్చేలా ఏడాది ముందే ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించినట్టు ఆయన చెప్పారు.
ఇస్రోకు చెందిన శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. ఈ లాంచ్ ప్యాడ్‌ను రూ.3,985 కోట్లతో నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తర్వాతి తరం వ్యోమనౌకల ప్రయోగానికి, రెండో ప్రయోగ వేదికకు తోడ్పాటుగా ఉండటానికి మూడో ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు. నాలుగేండ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు.