ముంబై: కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ (Kanhaiya Kumar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మేకింగ్‌లో బిజీగా ఉంటారని అన్నారు. ధర్మాన్ని రక్షించే బాధ్యత ఉన్న వారు ఇలాంటివి చేయవచ్చా? అని ప్రశ్నించారు. నాగ్‌పూర్ నైరుతి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తరుఫున కన్నయ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఫడ్నవీస్ ఇటీవల తమది ‘ధర్మయుద్ధ్’ అని, ప్రతిపక్షాలది ‘ఓట్ జిహాద్’ అని విమర్శించారు.
కాగా, ఫడ్నవీస్ వ్యాఖ్యలపై కన్నయ్య కుమార్ స్పందించారు. ‘ధర్మాన్ని’ నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని అన్నారు. ‘ఇది ధర్మ యుద్ధమే (మత యుద్ధం). అయితే మతాన్ని రక్షించడం కోసం ప్రసంగాలు చేసే ఏ నాయకుడినైనా ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి సొంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా? అని అడగండి. నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజలు మతాన్ని కాపాడటం ఎలా సాధ్యం. డిప్యూటీ సీఎం భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నప్పుడు మతాన్ని రక్షించే బాధ్యత ప్రజలపై ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు.
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్‌పర్సన్‌గా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షాపై కూడా కన్నయ్య కుమార్ మండిపడ్డారు. ‘అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడే పోరాటంలో చేరుతాడా లేదా? బీసీసీఐలో ఐపీఎల్ జట్లను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అయితే డ్రీమ్ 11 లో టీమ్స్ ఏర్పాటు చేయాలని మనకు చెబుతాడు. క్రికెటర్లు కావాలని వారు కలలు కంటారు. మనం మాత్రం జూదగాళ్లుగా మిగిలిపోతాం’ అని అన్నారు. అయితే కన్నయ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఫడ్నవీస్ భార్యపై వ్యాఖ్యలు మరాఠా మహిళలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.