Bihar : బిహార్ లో బురఖాలు నిషేధిస్తూ జువెలరీ షాపుల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం సరికాదని కొందరు అంటుంటే.. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని మరికొందరు సమర్ధిస్తున్నారు. నగల షాపుల్లోకి బురఖాలు, హిజాబ్ లు, మాస్కులు, హెల్మెట్లు ధరించి రాకూడదని బిహార్ నగల వ్యాపారుల సంఘాలు నిర్ణయించాయి. దీని ప్రకారం.. ప్రతి నగల షాపు వద్ద నోటీసులు అంటించారు.
భద్రత, ఇతర కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని నగల వ్యాపారులు కోరుతున్నారు. బురఖా, హిజాబ్, మాస్క్, హెల్మెట్ ధరించిన వారిని షాపుల లోపలికి అనుమతించబోమని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యూపీలో కూడా ఇలాంటి నిబంధనే అమలు చేశారు. తాజా నిర్ణయంపై అఖిల భారత నగల వ్యాపారుల సమాఖ్య, బిహార్ అధ్యక్షుడు అశోక్ కుమార్ వర్మ మాట్లాడారు. అన్ని జిల్లాల అధ్యక్షులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల ఆధారంగా, భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, ఈ విషయాన్ని వినియోగదారులకు మర్యాదపూర్వకంగానే చెబుతూ, సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. తాజా నిర్ణయంపై ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
జువెలరీ షాపుల్లో చోరీలు జరిగిన కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించడం కష్టమవుతోందని, పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని అశోక్ కుమార్ అన్నారు. బంగారం, వెండి ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాల్సి వస్తోందన్నారు. ఒకవేళ ఎవరైనా తమ నిబంధనలు పాటించకపోతే నగలు అమ్మబోమని చెప్పారు. నగలు కొనేది ఎక్కువగా మహిళలే కాబట్టి.. వారి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని నగల షాపుల్లో మహిళా సిబ్బంది ఎక్కువగా ఉండేటట్లు చూస్తున్నట్లు తెలిపారు. అయితే, బురఖాలు, హిజాబ్ వంటి వాటి నిషేధాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై బిహార్ ఏఐఎంఐఎం నేత మాట్లాడుతూ.. నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, మహిళల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. జేడీయూ నేత అంజుమ్ ఆరా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల కొందరు మహిళలు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని, వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.