అహ్మదాబాద్: పాకిస్థాన్‌కు చెందిన మరో ఏడు ఫిషింగ్ బోట్లను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) గురువారం సీజ్ చేసింది. గుజరాత్‌లోని భుజ్ జిల్లాలోని క్రిక్ తీర ప్రాంతంలో మరిన్ని పాక్ పడవలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగా ఏడు పాకిస్థాన్ ఫిషింగ్ బోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ పీఆర్వో తెలిపారు. బీఎస్ఎఫ్కు చెందిన క్రిక్ క్రొకడాయిల్ కమాండో టీమ్స్ ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు. హరామి నల్లా ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న పాక్ పడవల్లో కుళ్లిన చేపలు ఉన్నాయని వివరించారు. ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇటీవల అదుపులోకి తీసుకున్న పాక్ మత్స్యకారులను ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, పాకిస్థాన్‌కు చెందిన కొందరు మత్స్యకారులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. గుజరాత్‌లోని భుజ్ జిల్లా క్రిక్ తీర ప్రాంతానికి పదుల సంఖ్యల్లో పడవల్లో చేరుకున్నారు. అయితే బీఎస్ఎఫ్ గస్తీ బృందాలు ఈ విషయాన్ని పసిగట్టాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9న వాయుసేనకు చెందిన హెలీకాప్టర్లలో హరామి నల్లా ప్రాంతంలో గాలించారు. అనుమానాస్పదంగా కనిపించిన 11 పాకిస్థాన్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లోని నీటి చెలమల వద్ద దాక్కున్న ఆరుగురు పాక్ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు.