ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని పశ్చిమ మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ భగీరథ్ భాలే తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంఢర్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. భగీరథ భాలే అసెంబ్లీ రంగంలోకి దిగితే పండర్పూర్లో చతుర్ముఖ పోరు సాగే అవకాశం ఉంది.
దివంగత ఎమ్మెల్యే భరత్ భాలే జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ్ భాలే మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వైఖరి ఇంకా ఖరారు కాలేదు. పార్టీ ఆదేశాల మేరకు లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నాం. పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో మహారాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ వైఖరి ఏమిటనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు’ అని వివరించారు.