చండీగఢ్: నిద్రిస్తున్న పిల్లలపై ఇటుక బట్టీ గోడ కూలింది. ఈ సంఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. (Children Killed) మరో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందని పోలీసులు తెలిపారు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుడానా గ్రామంలోని ఇటుక బట్టీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి తమ పిల్లలతో కలిసి అక్కడ నిద్రించారు. అయితే ఇటుక బట్టీ గోడ కూలి వారిపై పడింది. ఈ సంఘటనలో నలుగురు పిల్లలు మరణించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మూడు నెలల చిన్నారి నిషా, ఐదేళ్ల నందిని, తొమ్మిదేళ్ల వయస్సున్న సూరజ్, వివేక్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన గౌరి అనే ఐదేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. హిసార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఐదుగురు చిన్నారులు ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా బాదవ్ గ్రామానికి చెందినవారని పోలీస్ అధికారి వెల్లడించారు.