న్యూఢిల్లీ: మెదడులో కణుతులు (బ్రెయిన్ ట్యూమర్) వృద్ధులకే వస్తాయనే భావన ఉంది. కానీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాలలు, 20-30 ఏండ్ల యువతలోనూ బ్రెయిన్ ట్యూమర్ల కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో అత్యధికులకు రోగ నిర్థరణ చాలా ఆలస్యంగా జరుగుతున్నదని వెల్లడించారు.
ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవడం, సకాలంలో చికిత్స చేయించుకోవడం, తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తుండటం తప్పనిసరి అని వివరించారు. నేషనల్ బ్రెయిన్ ట్యూమర్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం బ్రెయిన్ ట్యూమర్స్ కేసుల్లో 5.7 శాతం మేరకు 0-19 ఏండ్ల మధ్య వయస్కులకు వస్తున్నాయి. ఇవి హానికరం కానట్లుగా ఉంటాయని, అయితే సకాలంలో చికిత్స చేయించడం ముఖ్యమని డాక్టర్ అనురాగ్ సక్సేనా చెప్పారు.
శిశువులకు ఈ వ్యాధి సోకితే, వారి పుర్రె ఎదుగుదల అసాధారణంగా ఉంటుంది. బాలలకు బ్రెయిన్ ట్యూమర్ వస్తే అతిగా ఏడవడం, స్పందించకపోవడం, కంటి చూపు సమస్యలు కనిపిస్తాయి. టీనేజర్లలో అయితే అలసట, తలనొప్పి, తల తిప్పడం, కండ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం పూట వాంతులు అవడం, తలనొప్పితోపాటు వాంతులు రావడం, చూడటం, వినటం, మాట్లాడటంలో సమస్యలు; నడవటం ఇబ్బందికరంగా ఉండటం, మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు, మెదడులో మెరుపులు మెరిసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్స్ చేయిస్తే బ్రెయిన్ ట్యూమర్లను గుర్తించవచ్చు. హానికరం కాని ట్యూమర్లను శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా తొలగించవచ్చు. దీర్ఘకాలిక నష్టాన్ని నివారించాలంటే, ముందుగానే ఈ లక్షణాలను గుర్తించి, చికిత్స చేయించాలి.