న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక అమెరికా పాత్రకు చైనా లింకు పెట్టింది. ఈ ఘటనపై భారత వ్యూహాత్మక నిపుణుడు బ్రహ్మ చెల్లానీ చేసిన ట్వీట్‌ను చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ మేరకు వక్రీకరించింది. అయితే ఈ కథనాన్ని బ్రహ్మ చెల్లానీ ఖండించారు. బిపిన్ రావత్ మరణం వెనుక బయట వారి ప్రమేయం ఏమీ లేదన్నారు.
తమిళనాడులో బుధవారం సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది రక్షణ సిబ్బంది మరణించిన ఘటనపై ఢిల్లీకి చెందిన వ్యూహాత్మక నిపుణుడు, రచయిత బ్రహ్మ చెల్లానీ బుధవారం ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తైవాన్ టాప్ మిలిటరీ ఆఫీసర్ జనరల్ షెన్ యి-మింగ్ మరణించిన ఘటనను దీనితో పోల్చారు. ‘సరిహద్దులో 20 నెలల సుదీర్ఘ చైనా దురాక్రమణ నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయంలో, హెలికాప్టర్ ప్రమాదంలో భారత రక్షణ చీఫ్ జనరల్ రావత్, ఆయన భార్య, 11 మంది ఇతర సైనిక సిబ్బంది మరణం విషాదకరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది జరిగి ఉండాల్సింది కాదు’ అని ట్వీట్ చేశారు.
2020 ప్రారంభంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తైవాన్ జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ షెన్ యి-మింగ్, ఇద్దరు మేజర్ జనరల్‌లతో సహా మరో ఏడుగురు మరణించిన సంగతిని బ్రహ్మ గుర్తు చేశారు. జనరల్ రావత్ హెలికాప్టర్ క్రాష్ మరణం దీనికి సమాంతరంగా ఉందన్నారు. ‘చైనా దూకుడును తీవ్రంగా వ్యతిరేకించిన రక్షణ రంగంలోని కీలక వ్యక్తులు ఈ రెండు ఘటనల్లో మరణించారు’ అని పేర్కొన్నారు. దీనిపై చైనా అధికార పత్రిక గ్లొబల్ టైమ్స్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, ఏడాదిగా చైనా దూకుడుతో పాటు ప్రాదేశిక వివాదాలున్న భారత్, తైవాన్‌లో జరిగిన రెండు హెలికాప్టర్ ప్రమాద ఘటనల్లో రక్షణ రంగంలోని కీలక వ్యక్తుల మరణం వెనుక బయటి దేశాల ప్రమేయాన్ని బ్రహ్మ చెల్లానీ కొట్టిపారేశారు. ‘విచిత్రమైన పోలిక ఉన్న రెండు హెలికాప్టర్ క్రాష్‌లకు బయటి హస్తం మధ్య ఏదైనా సంబంధం ఉందని అర్థం కాదు. ఏదైనా ఉంటే, ప్రతి ప్రమాదం ముఖ్యమైన అంతర్గత ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రత్యేకించి టాప్ జనరల్‌లను రవాణా చేసే సైనిక హెలికాప్టర్ల నిర్వహణ గురించే’ అని ఆయన పేర్కొన్నారు. టాప్ జనరల్స్ ప్రయాణాలకు వినియోగించే సైనిక హెలికాప్టర్ల నిర్వహణ నాణ్యతను ఆయన సూటిగా ప్రశ్నించారు.
కాగా, బ్రహ్మ చెల్లానీ చేసిన ఈ వ్యాఖ్యలను చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వక్రీకరించింది. హెలికాప్టర్ క్రాష్‌లో అమెరికా పాత్ర ఉందన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేసినట్లుగా పేర్కొంది. బిపిన్ కీలక పాత్ర వహించిన భారత్-రష్యా మధ్య ఎస్-400 ఒప్పందాన్ని అమెరికా వ్యతిరేకిస్తుండమే దీనికి కారణమని విశ్లేషించింది.
అయితే గ్లోబల్ టైమ్స్ కథనాన్ని బ్రహ్మ చెల్లానీ ఖండించారు. రెండు హెలికాప్టర్ల ప్రమాదాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలను అమెరికాతో లింకుపెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు మరో ట్వీట్ చేశారు. ‘రష్యా S-400 వ్యవస్థను భారత్ కొనుగోలు చేస్తున్నందున, టాప్ ఇండియన్ జనరల్‌ను పొట్టనపెట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదం వెనుక అమెరికా ఉందని ఆరోపిస్తూ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మౌత్‌పీస్ నా ట్వీట్‌ను దుర్వినియోగం చేసింది. సీసీపీ వ్యక్తుల చెడ్డ మనస్తత్వాన్ని ఈ ట్వీట్ సూచిస్తుంది’ అని విమర్శించారు.
Here's the CCP mouthpiece misusing my tweet from a thread to accuse U.S. of being behind the helicopter crash that killed the top Indian general because India is buying Russian S-400 system! Its tweet sadly points to the depraved mindset of the CCP folks. https://t.co/4NUrlZ4Lj6
— Brahma Chellaney (@Chellaney) December 8, 2021