న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి హోటల్లో బస చేశాడు. వారి మధ్య గొడవ జరుగడంతో కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. (Boyfriend Stabs Woman) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌కు చెందిన శివాని, రాజస్థాన్‌కు చెందిన ఆమె ప్రియుడు ప్రకాష్ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని లాహోరీ గేట్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేశారు. ఆ రాత్రివేళ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ కత్తితో శివానిని పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కాగా, గురువారం ఉదయం హోటల్ రూమ్‌లో శివాని రక్తపు మడుగులో పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ప్రకాష్ గాయపడిన స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. శివాని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాష్‌ను కూడా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.