Boycott Turkey : దేశంలో బాయ్‌కాట్ టర్కీ (Boycott Turkey) నినాదం ఊపందుకుంది. బాయ్‌కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం ఏమిటంటే.. గత నెల 22న ఉగ్రవాదులు (Terrorists) పర్యాటకులే (Tourists) లక్ష్యంగా జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) కు సమీపంలోని బైసరన్ (Baisaran) లోయలో కాల్పులకు తెగబడ్డారు. మహిళలు, చిన్నారులను విడిచిపెట్టి పురుషులను పేర్లు అడుగుతూ అతి సమీపం నుంచి కాల్చిచంపారు.
ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. ఆ తర్వాత ఈ ఘాతుకానికి ఒడిగట్టింది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులేనని తేలింది. దాంతో పాకిస్థాన్‌లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దాంతో ఉగ్రవాదుల మద్దతుగా పాకిస్థాన్ సైన్యం భారత సైన్యంలో కయ్యానికి కాలుదువ్వింది. సరిహద్దుల వెంట మిస్సైల్ దాడులు చేసింది. ఆ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టి పాకిస్థాన్ వెన్నులో వణుకుపుట్టించింది.
అయితే భారత్, పాకిస్థాన్ పరస్పర దాడుల సందర్భంగా టర్కీ పాకిస్థాన్ మద్దతుగా నిలిచింది. దాంతో ఎర్డోగాన్ ప్రభుత్వ తీరుపై మన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బాయ్‌కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలై ఊపందుకుంది. ‘బ్యాన్ టర్కీ’ అంటూ పలువురు వ్యాపారులు ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. పుణెలోని వ్యాపారులు కూడా టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్‌లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
పుణె మార్కెట్లో ఒక సీజన్లో టర్కీ యాపిల్ల టర్నోవర్ రూ.1000 నుంచి 1200 కోట్ల వరకు ఉంటుంది. ఈ క్రమంలో టర్కీ యాపిల్స్‌ను నిషేధించడంవల్ల పండ్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం దీన్ని తాము ఆర్థిక నిర్ణయంగా మాత్రమే కాదని, ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని అంటున్నారు. యాపిల్‌లను అక్కడ నుంచి దిగుమతి చేసుకునే బదులు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.