ముంబై: పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిన బద్లాపూర్ లైంగిక దాడి నిందితుడు అక్షయ్ షిండే (24) మరణానికి దారి తీసిన పరిస్థితులపై బాంబే హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. నిందితుడు పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని మూడు రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు ఆరోపించారని, ఒక బుల్లెట్టే పోలీస్‌కు తగిలిందని, మిగిలిన రెండు తుపాకీ గుళ్లు ఏమయ్యాయని జస్టిస్‌లు రేవతి మెహితే దేరె, పృథ్వీరాజ్ చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది. పరిస్థితిని చక్కదిద్దడంతో పోలీస్ శాఖ విఫలమైందని, నిందితుడిని మోకాలి కింద కాల్చి ఉండాల్సిందని పేర్కొంది.
360 డిగ్రీల రక్షణతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సాయుధ బలగాలకు 360 డిగ్రీల రక్షణ కల్పించే తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్లను డీఆర్డీఓ, ఐఐటీ ఢిల్లీ కలిసి అభివృద్ధి చేశాయి. అడ్వాన్స్డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్(ఏబీహెచ్‌ఈడీ) పేరుతో డీఆర్డీఓకు చెందిన ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్, ఐఐడీ ఢిల్లీ ఈ జాకెట్లను తయారు చేశాయి. పాలిమర్లు, స్వదేశీ బోరన్ కార్బైడ్ సెరామిక్ను వీటికి ఉపయోగించారు. ఈ జాకెట్ బరువు 8.2 కిలోల నుంచి 9.5 కిలోల వరకు ఉంటుందని డీఆర్డీఓ తెలిపింది. వీటిని ధరించిన వారికి అన్ని వైపుల నుంచి రక్షణ ఉంటుందని పేర్కొన్నది.